నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..
సాక్షి, హైదరాబాద్ : అభం, శుభం తెలియని వెటర్నరీ వైద్యురాలు దిశపై దారుణానికి పాల్పడ్డ పదో రోజు నలుగురు మృగాళ్ల కథ ముగిసింది. దేశం నినదించిందే నిజమయింది. దిశపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు చివరకు పోలీసుల తూటాలకు బలయ్యారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నం చేశారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే హతమయ్యారు.
గత నెల 27న దిశను నిందితులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. కేసులో తాము పట్టపడకుండా తప్పించుకునేందుకు..దిశను తగలబెట్టారు. నవంబర్ 28న నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. నవంబర్ 30న నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. చర్లపల్లి జైలుకు వారిని తరలించారు. ఈనెల 4న నిందితులను షాద్‌నగర్ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఘటనపై నిన్న నిందితులను సిట్ విచారించింది. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు నిందితులను ఘటనా స్థలానికి పోలీసులు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో గత రెండు రోజుల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటించాయి.